palvai sravanthi: రాజగోపాల్‌రెడ్డి తిరిగి వస్తే 24 గంటల్లో టిక్కెట్ కేటాయించారు: పాల్వాయి స్రవంతి భావోద్వేగం
- రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపిన పాల్వాయి స్రవంతి
- పార్టీని వీడేందుకు దారితీసిన పరిస్థితులు అందులో వివరించినట్లు వెల్లడి
- పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నీ తుంగలో తొక్కారని విమర్శలు
- జగదీశ్ రెడ్డి ఇంటికి వచ్చి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారన్న స్రవంతి
- కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం బాధగానే ఉందన్న పాల్వాయి స్రవంతి
తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి పంపించానని, పార్టీ వీడేందుకు దారితీసిన పరిస్థితులు, నాయకత్వం తీరుపై ఆ లేఖలో వివరించానని పాల్వాయి స్రవంతి అన్నారు. ఆమె హైదరాబాదు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామా నేపథ్యంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇటీవల పదవులు, టిక్కెట్ల కేటాయింపుల్లో అవకతవకలు కనిపిస్తున్నాయన్నారు. తన తండ్రి గోవర్ధన్ రెడ్డి అరవై ఏళ్ల పాటు ఇదే పార్టీలో ఉన్నారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కార్పోరేట్ పార్టీగా మారిందని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి తన ఇంటికొచ్చి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. రేపో మాపో నిర్ణయం వెల్లడిస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడాల్సి రావడం తనకు బాధగానే ఉందన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలలో తన తండ్రి పాత్ర ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు కార్పోరేట్, బ్రోకర్ పార్టీగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చచ్చిపోయిందని పార్టీని విడిచి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి తిరిగి వస్తే మళ్లీ కండువా కప్పారని ధ్వజమెత్తారు. పైగా ఆయనకు 24 గంటల్లో మునుగోడు టిక్కెట్ కేటాయించారన్నారు. పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న తనకు కనీసం మాట కూడా చెప్పలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నీ తుంగలో తొక్కారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజలపక్షాన బీఆర్ఎస్ మాత్రమే నిలబడుతుందని ప్రస్తుతం తాను నమ్ముతున్నానని స్రవంతి చెప్పారు.