KTR: రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడారు... బహిరంగ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్
- కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్న కేటీఆర్
- కాంగ్రెస్ వస్తే పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు అన్న కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టాలని పిలుపు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. అర్ధరాత్రి, అపరాత్రి కరెంట్ వస్తే రైతన్నలు ఎంతగా ఇబ్బందిపడ్డారో అందరూ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు నాలుగు గంటలకు మించి కరెంట్ వచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు ఉండేవని విమర్శించారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రజలు స్పష్టంగా వినాలన్నారు. అమెరికాలో మూడు గంటల విద్యుత్ చాలని రేవంత్ చెప్పారని, సరే అక్కడ ఏదో చెప్పారని ఊరుకున్నా.. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణలో ఉన్నది చిన్న, సన్నకారు రైతులేనని, కాబట్టి 3 గంటల విద్యుత్ చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.11వేల కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. తమ వద్ద వరి ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. అందుకే తెలంగాణ రైతు... కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించుకోవాలన్నారు. కేంద్రం మెడలు వంచి కేసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. మేమంతా రైతుల కోసమే పని చేస్తున్నామని, రైతుల భూముల రక్షణ కోసం ధరణి తీసుకు వచ్చామన్నారు. రైతు బీమా, రైతు బంధు తెచ్చామని, ప్రతి ఊళ్లో ప్రతి గింజను రైతు నుంచి కొంటున్నామన్నారు.
ఆగమైనపోయిన రైతు బాగుండాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అంటే పండు కోతలు... కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని కేటీఆర్ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ అన్న కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేరల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు పొరపాటున అధికారం ఇస్తే ఆగం కావడం ఖాయమన్నారు. రైతులకు విద్యుత్‌పై ఇష్టారీతిన మాట్లాడిన రేవంత్ రెడ్డి బాహాటంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఒకరు మూడు గంటలు అంటే... మరొకరు ఐదు గంటలు అంటారని, తొలుత వారికి స్పష్టత రావాలన్నారు.