Mitchell Marsh: మార్ష్ విశ్వరూపం... బంగ్లాపై గ్రాండ్ గా గెలిచిన ఆసీస్
- వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసిన బంగ్లా
- 307 పరుగుల లక్ష్యాన్ని 44.4 ఓవర్లలో 2 వికెట్లకు ఛేదించిన ఆసీస్
- 176 పరుగులతో అజేయంగా నిలిచిన మార్ష్
- 17 ఫోర్లు, 9 సిక్సులతో విధ్వంసక ఇన్నింగ్స్
వరల్డ్ కప్ లో తన చివరి లీగ్ మ్యాచ్ ను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసీస్ విజయంలో మిచెల్ మార్ష్ హీరోగా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలుత 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేయగా... 307 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 44.4 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి ఛేదించారు. మార్ష్ భారీ సెంచరీతో వీరవిహారం చేయడంతో బంగ్లా బౌలర్లు కుదేలయ్యారు. ఈ ఆజానుబాహుడు 132 బంతుల్లో 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్ష్ స్కోరులో 17 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 10 పరుగులకే వెనుదిరగ్గా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 53 పరుగులతో రాణించాడు. అనంతరం మార్ష్, స్టీవ్ స్మిత్ జోడీ మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. స్మిత్ 64 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 1, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు. ఈ విజయం అనంతరం ఆసీస్ మొత్తం 9 మ్యాచ్ ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. సెమీస్ లో ఆసీస్... దక్షిణాఫ్రికాతో తలపడనుంది.