Narendra Modi: తమ్ముడూ, మంద కృష్ణా! 30 ఏళ్లు పోరాడావ్.. మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలుకుతా: ప్రధాని మోదీ హామీ

PM Modi praises Manda Krishna Madiga

  • నా కుటుంబ సభ్యులారా... అంటూ ప్రధాని మోదీ ప్రసంగం
  • ప్రసంగం మధ్యలోను పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అంటూ పలికిన ప్రధాని
  • బీజేపీ అంటే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అన్న మోదీ
  • ఇంత విశాల సభను ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు మంద కృష్ణకు ధన్యవాదాలన్న ప్రధాని 
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత విరోధి అంటూ వ్యాఖ్య 
  • దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శ
  • రామ్ నాథ్ కోవింద్‌ను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతులుగా చేసింది బీజేపీయేనని వివరణ  
  • త్వరలో ఎస్సీ వర్గీకరణపై ఓ కమిటీ వేస్తామన్న ప్రధాని మోదీ



మంద కృష్ణ మాదిగ చేస్తున్న వర్గీకరణ పోరాటానికి నేను సహకారిగా ఉంటానని, మీకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకు కట్టుబడి ఉన్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. న్యాయం కోసం మీరు చేసే పోరాటానికి నేను కచ్చితంగా అండగా ఉంటానన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా కుటుంబ సభ్యులారా.. అంటూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. 

పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే ఆనందం రెట్టింపు అవుతుందని, ఇప్పుడు తనకు అలాగే ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంద కృష్ణ మాదిగ తనకు సోదరుడు అని, మీరంతా నా సోదరులే అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా మాదిగ సోదర, సోదరీమణుల మధ్యకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. పండుగ సమయంలో ఈ కుటుంబ సభ్యుల మధ్య గడుపుతుంటే తనకు పట్టలేని ఆనందంగా ఉందని, తనకు రెట్టింపు సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద విశాల సభను ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు మంద కృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ సభకు తనను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నారు.

మీ ఉద్యమంలో నేనూ ఉంటాను... 

నా కుటుంబ సభ్యులారా.. బీజేపీ అంటేనే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అన్నారు. తమ ప్రభుత్వం తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అన్నారు. బీజేపీ అణగారిన వర్గాల పక్షాన నిలిచిందన్నారు. గుర్రం జాషువా తన కష్టాలను కాశీ విశ్వనాధునికి విన్నవించుకున్నారని, ఇప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సులతో తాను ఇప్పుడు ప్రధానిగా మీ ముందు ఉన్నానన్నారు. మంద కృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. ఈ సమయంలో వేదికపై కూర్చున్న మంద కృష్ణను.. తమ్ముడు కృష్ణా అంటూ పిలిచి.. ఇన్నాళ్లు మీరు పోరాడారు... మీ ఉద్యమంలో నేను కూడా ఉంటానని భరోసా ఇస్తున్నాను అని ప్రధాని మోదీ చెప్పారు. మీ బాధను పంచుకునేందుకు నేను ఇక్కడకు వచ్చానన్నారు. ఇన్ని రోజులు ఎంతోమంది రాజకీయ నాయకులు మీకు హామీ ఇచ్చి విస్మరించారని, ఆ రాజకీయ నాయకుల పక్షాన నేను క్షమాపణలు చెబుతున్నానన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత విరోధి.. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చాం

పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినా ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఈ రోజు తెలంగాణ సంకట పరిస్థితిలో ఉందన్నారు. తెలంగాణ రాగానే సీఎం కేసీఆర్ బలిదానాలు చేసిన వారికి కాదని... కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదన్నారు. అధికారంలోకి రాగానే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. మీ కుర్చీని లాక్కున్నారన్నారు. మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదన్నారు. రైతుబంధు ద్వారా ఎమ్మెల్యేలకు, వారి బంధువులకు మాత్రమే లాభం జరిగిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దళిత్ విరోధి అన్నారు. ఆ రెండు పార్టీలతో మాదిగలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి కేసీఆర్.. అంబేడ్కర్‌ను అవమానించారని, కాంగ్రెస్ అంబేడ్కర్‌ను రెండుసార్లు ఓడించిందన్నారు. కానీ బీజేపీ హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో అంబేడ్కర్ చిత్రపటం పెట్టామని, భారతరత్న ఇచ్చామన్నారు.

దళిత వర్గాలకు చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను తాము రాష్ట్రపతిగా చేసిన సమయంలో కాంగ్రెస్ ఆయనను ఓడించే ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీ తొలిసారి గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిందన్నారు. జగ్జీవన్ రామ్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్, తదితరులకు పెద్ద పీట వేశామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే అవినీతికి మారుపేరు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీని కఠినతరం చేశామన్నారు. పేదలకు ఎన్నో రకాలుగా అండగా ఉంటున్నామన్నారు. తాము పెట్టిన అనేక పథకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలే అత్యధిక లబ్ధిదారులన్నారు. ముద్ర లోన్ ద్వారా ఎక్కువగా లబ్ధి పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు ఉన్నారన్నారు.

మీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా

పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిగా.. నేను ఉచిత రేషన్‌ను మరో అయిదేళ్లు పొడిగించానన్నారు. రైతులను ఆదుకోవడానికి కేంద్రం కొనుగోలు ధరను పెంచుతూ వెళ్తోందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తెలంగాణ దళిత సామాజిక వర్గానికి చెందిన బంగారు లక్ష్మణ్‌తో కలిసి తాను పని చేశానన్నారు. బంగారు లక్ష్మణ్ వద్ద తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. బంగారు లక్ష్మణ్‌ను తన గురువుగా భావిస్తున్నట్లు చెప్పారు. మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లగా మీ కోసం పోరాడుతున్నారన్నారు. మంద కృష్ణ తన తమ్ముడి లాంటి వాడన్నారు. ఆయన తన యవ్వనాన్ని మీ కోసం ధారపోశారన్నారు. బంగారు లక్ష్మణ్ వద్ద నేను పని చేశానని.. అలాగే మాదిగ సమాజానికి జరిగిన అన్యాయాన్ని నేను గుర్తించానన్నారు. మంద కృష్ణ నా చిన్న తమ్ముడే కాకుండా.. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను పని చేస్తానని హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి మంద కృష్ణ మాదిగకు జన్మనిచ్చినందుకు ఆయన తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నానన్నారు.

ముప్పై ఏళ్ళుగా అహింసకు తావులేకుండా మీకు జరుగుతున్న అన్యాయంపై పోరాడారని, మీ ఉద్యమాన్ని నేను గుర్తించి, గౌరవిస్తున్నానన్నారు. హక్కుల కోసం మీ పోరాటాన్ని గుర్తించామని... త్వరలో ఎస్సీ వర్గీకరణపై ఓ కమిటీ వేస్తామన్నారు. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు. మీకు జరిగిన అన్యాయానికి ముగింపు పలకడానికి మేం కట్టుబడి ఉన్నామన్నారు. భారత ప్రభుత్వం మీకు న్యాయం చేసేందుకు పని చేస్తుందన్నారు.

  • Loading...

More Telugu News