Revanth Reddy: వాటి కోసమే అయితే తెలంగాణ అవసరం లేదన్న రేవంత్ రెడ్డి... బీఆర్ఎస్ కౌంటర్ ట్వీట్!
- ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణ ఎప్పుడూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆలోచన చేయలేదని వ్యాఖ్య
- నీళ్లే కావాలంటే సీమాంధ్రులు ఇవ్వలేదా? అని ప్రశ్న
- హైదరాబాద్ అభివృద్ధికి సీమాంధ్రులు నిధులు కేటాయించారన్న రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ టీవీ ఛానల్ ప్రోగ్రాంలో పాల్గొన్న రేవంత్.... తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆలోచన చేయలేదన్నారు. నీళ్లే కావాలంటే సీమాంధ్రులు నీళ్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ప్రాణహిత చేవెళ్ల, అర్ధాంతరంగా ఆగిపోయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు అప్పుడే ప్రారంభమయ్యాయి కదా అన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి నిధులు కేటాయించారని.. నియామకాలు ఎనిమిది డీఎస్సీలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారన్నారు. ప్రభుత్వ నియామకాలు కాస్త వెనుకో ముందో జరుగుతూనే వచ్చాయన్నారు. వాటి కోసమే అయితే తెలంగాణ అవసరమే లేదన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ కూడా ట్వీట్ చేసింది. 'కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మీద స్కాంగ్రెస్ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన ఇది.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించలేదని.. ఒకవేళ వాటి కోసమే అయితే తెలంగాణ అవసరం లేదంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలి' అని పేర్కొంది.