MOIS: రోడ్డుపై పాదచారులు, సైక్లిస్టుల భద్రత కోసం కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థకు ప్రతిపాదనలు
- వాహనాల్లో ‘మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ ఏర్పాటుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదన
- ఎమ్2, ఎమ్3, ఎన్2, ఎన్3 కేటగిరీల వాహనాల్లో ఏర్పాటు చేయాలని సూచన
- పాదచారులు సమీపంలో ఉన్నప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేయనున్న సిస్టం
- ప్రమాదం జరిగే అవకాశం ఉంటే డ్రైవర్‌కు హెచ్చరికలు
పాదచారులు, సైక్లిస్టులను వాహనాలు ఢీకొట్టకుండా ఉండేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొన్ని కేటగిరీల వాహనాల్లో కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వివిధ రకాల ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల్లో ‘మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ను ఏర్పాటు చేయాలని సూచించింది. వాహనం సమీపంలో పాదచారులు లేదా సైక్లిస్టులు ఉన్న సందర్భంలో డ్రైవర్లను ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది.
అంతేకాకుండా, ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ తరువాత నిబంధనలను నోటిఫై చేస్తామని రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. ఎమ్2, ఎమ్3, ఎన్2, ఎన్3 కేటగిరీల వాహనాల్లో (బస్సులు, ట్రక్కులు) ఈ వ్యవస్థను అమర్చుతారు. రోడ్డు ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న పాదచారులు, సైక్లిస్టుల (వల్నరబుల్ రోడ్ యూజర్స్) భద్రత కోసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.