Rahmanullah Gurbaz: అహ్మదాబాద్ లో నిర్భాగ్యుల పట్ల పెద్ద మనసు చాటుకున్న ఆఫ్ఘన్ ఓపెనర్ గుర్బాజ్
- వరల్డ్ కప్ లో అంచనాలకు మించి రాణించిన ఆఫ్ఘనిస్థాన్
- అహ్మదాబాద్ లో రాత్రివేళ వీధుల్లో నిద్రించేవారి పక్కన డబ్బు ఉంచిన గుర్బాజ్
- ఆ డబ్బుతో వారు దీపావళి చేసుకోవాలన్నది గుర్బాజ్ కోరిక
- వైరల్ అవుతున్న వీడియో
వరల్డ్ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి సంచలనాల మోత మోగించిన జట్టు ఆఫ్ఘనిస్థాన్. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘన్ జట్టు ఆటతీరుకు దేశాలకు అతీతంగా అభిమానులు ఏర్పడ్డారు.
తొలుత ఇంగ్లండ్ పై నెగ్గితే సంచలనం అన్నారు... ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లను కూడా ఓడించేసరికి ఆఫ్ఘనిస్థాన్ ను బలమైన జట్టుగానే పరిగణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక, అసలు విషయానికొస్తే... ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. అహ్మదాబాద్ లో వీధుల్లో, ఫుట్ పాత్ లపై దయనీయంగా బతుకు బండి లాగించే నిర్భాగ్యులకు ఆర్థికసాయం చేశాడు. అది కూడా, వారు నిద్రిస్తుండగా, వారికి తెలియకుండా వారి పక్కన కొంత డబ్బు ఉంచాడు. వారు ఆ డబ్బుతో దీపావళి వేడుకలు చేసుకోవాలన్నది రహ్మనుల్లా గుర్బాజ్ కోరిక.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గుర్బాజ్ మంచి మనసును నెటిజన్లు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. గుర్బాజ్ దాతృత్వంపై న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర కూడా స్పందించాడు.
"ఈ ఆఫ్ఘన్ అబ్బాయిల మనసు నిజంగా స్వచ్ఛమైన బంగారం అని అభివర్ణించాడు. వారు ఎంతో దయగల క్రికెటర్లు. వారు భారత్ లో ఇంతమంది అభిమానం పొందుతుండడంలో ఆశ్చర్యమేమీ లేదు. భారత్ లో వారు మైదానంలోనూ, వెలుపల అందరి హృదయాలను గెలుస్తున్నారు" అంటూ ట్వీట్ చేశాడు.