Team India: టీమిండియా ఆల్ టైమ్ రికార్డ్... నెదర్లాండ్స్ పైనా విక్టరీ
- ఇవాళ బెంగళూరులో టీమిండియా, నెదర్లాండ్స్ మధ్య పోరు
- 160 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం
- వరల్డ్ కప్ లో తొలిసారి టీమిండియా టాప్-5 బ్యాటర్లు 50 ప్లస్ స్కోరు చేసిన వైనం
- లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్
- 9 మ్యాచ్ లు ఆడి అన్నింట్లోనూ గెలుపు
- ఈ నెల 15న కివీస్ తో సెమీఫైనల్
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. టోర్నీలో ఇవాళ చివరి లీగ్ మ్యాచ్ జరగ్గా... టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక.
టాస్ గెలిచిన టీమిండియా తొలుత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) సెంచరీలతో మెరిశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (61), శుభ్ మాన్ గిల్ (51), కోహ్లీ (51) అర్ధసెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో టీమిండియా ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున టాప్-5 బ్యాటర్లు 50కి పైగా పరుగులతో రాణించడం ఇదే ప్రథమం.
కాగా, భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ ను టీమిండియా బౌలర్లు 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ చేశారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో తెలుగుతేజం తేజ నిడమానూరు మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తేజ 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.
ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ 30, కోలిన్ అకెర్మన్ 35, ఎంగెల్ బ్రెక్ట్ 45 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, కుల్దీప్ యాదవ్ 2, జడేజా 2, కోహ్లీ 1, రోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.
ఈ విజయంతో టీమిండియా వరల్డ్ కప్ లీగ్ దశను అజేయంగా ముగించింది. మొత్తం 9 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన అన్ని మ్యాచ్ ల్లోనూ నెగ్గింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. గత వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే ఓడింది. అప్పుడు కూడా న్యూజిలాండే ప్రత్యర్థి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే చాన్స్ టీమిండియా ముందు నిలిచింది. టీమిండియా-న్యూజిలాండ్ సెమీస్ నవంబరు 15న ముంబయి వాంఖెడే స్టేడియంలో జరగనుంది.