Etela Rajender: గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేయడానికి కారణాన్ని వెల్లడించిన బీజేపీ నేత ఈటల రాజేందర్
- తనకు అన్యాయం జరిగింది కాబట్టే కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని క్లారిటీ
- కేసీఆర్ మాదిరిగానే తాను కూడా రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదని వ్యాఖ్య
- గజ్వేల్‌లో ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారన్న ఈటల
తానేమీ దిక్కులేక గజ్వేల్‌కు రాలేదని, కేసీఆర్‌ను ఢీకొట్టేందుకే పోటీకి వచ్చానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. తాను కూడా సీఎం కేసీఆర్ బాధితుడినేనని, తనకు అన్యాయం జరిగింది కాబట్టే ఆయనపై పోటీ చేస్తున్నానని అన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేయడానికి కారణం ఇదేనని ఈటల తెలిపారు. సీఎం కేసీఆర్ మాదిరిగానే తాను కూడా తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదని అన్నారు. సీఎం కేసీఆర్ గెలుస్తారా? ఈటలను గెలిపిస్తారా? అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లోనే ఉంటుందని చెప్పారు.
కేసీఆర్‌కి ఓటు వేసిన పాపానికి ప్రజల భూములను లాకున్నారని, రాష్ట్రానికి పట్టిన పీడ పోవాలనే తాను కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. తానేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసునని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా తాను పోషించిన పాత్రను ప్రజలు గుర్తించారని ఈ సందర్భంగా ఈటల పేర్కొన్నారు. గజ్వేల్‌లోని కొండపాక మండలంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్ ఈ విధంగా స్పందించారు.
టీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించి ఆ స్థానంలో మంత్రి హరీశ్ రావును కూర్చోబెట్టారని ఈటల మండిపడ్డారు. హుజురాబాద్ ఉపఎన్నికలో తనని ఓడించేందుకు కేసీఆర్ అక్రమ సంపాదన రూ.600 కోట్లు ఆరు నెలల్లో ఖర్చు పెట్టారని ఆరోపించారు. తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా విపత్కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవచేశానని ఈటల అన్నారు. కాగా ఈటల రాజేందర్ తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.