Trudeau: భారత దేశంపై మరోమారు విమర్శలు గుప్పించిన కెనడా ప్రధాని ట్రూడో

Trudeaus Fresh Barb At India Amid Diplomatic Row

  • అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందంటూ పరోక్షంగా విమర్శలు
  • చట్టాల అతిక్రమణ వల్ల అందరికీ ముప్పేనని హెచ్చరికలు
  • కెనడా పౌరుడి హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని మరోమారు ఆరోపణ

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి ఇండియాపై నోరుపారేసుకున్నారు. భారతదేశంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని, పెద్ద దేశాలు ఇలా నిబంధనలను అతిక్రమించడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు స్మార్ట్ ఎనర్జీ గ్రిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ట్రూడో మీడియాతో మాట్లాడారు.

భారత్ తో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ.. ప్రపంచంలోని పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను లెక్కచేయకుండా వ్యవహరించడం తీవ్ర ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దీనివల్ల మిగతా దేశాలకు ముప్పు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. కెనడా పౌరుడిని విదేశీ ఏజెంట్లు కెనడా గడ్డమీద హత్య చేయడం తీవ్రమైన విషయమని అన్నారు. 

ఈ హత్య ఇండియన్ ఏజెంట్ల పనేనని ఆషామాషీగా చెప్పడం లేదని, తమ వద్ద సమాచారం ఉందని అన్నారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, బాధితుల విచారణకు సహకరించాలని భారత్ కు విజ్ఞప్తి చేశామన్నారు. అయితే, భారత్ నుంచి సరైన సహకారం అందడంలేదని విమర్శించారు. దీంతో ఈ అంశాన్ని అమెరికా సహా మిత్ర దేశాల దృష్టికి తీసుకెళ్లినట్లు ట్రూడో వివరించారు.

జైశంకర్ స్పందన..
కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. చట్టాలను అతిక్రమించడం భారతదేశ విధానం కాదని స్పష్టం చేశారు. ఓ దేశాన్ని ప్రత్యేకంగా వేలెత్తి చూపుతున్నపుడు నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలని హితవు పలికారు. భారత్ కు వ్యతిరేకంగా ఉన్న అలాంటి ఆధారాలను చూపించాలని ట్రూడోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాటిని పరిశీలించాక స్పందిస్తామని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News