Revanth Reddy: ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమే: రేవంత్ రెడ్డి
- రాజకీయ లబ్ధి కోసం ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు చూశామన్న రేవంత్ రెడ్డి
- ఏపీలో కోడి కత్తి, బెంగాల్లో మమతా బెనర్జీ కాలికి గాయం వంటి కుట్రలు చూశామన్న పీసీసీ చీఫ్
- కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని వ్యాఖ్య
- కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి సంబంధించిన వివరాలు ఎందుకు వెల్లడించలేదని నిలదీత
అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం మీద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమే అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి కుట్రలు చూశామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కోడి కత్తి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాలికి గాయం వంటివి మనం ఇదివరకే చూశామన్నారు. అలాగే తెలంగాణలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కూడా కుట్రలో భాగమే అన్నారు.
సంచలనం కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిందని పోలీసులు కూడా చెప్పారని గుర్తు చేశారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకు మీడియా ముందుకు తీసుకురాలేదన్నారు. ఈ దాడికి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టును బహిర్గతపరచలేదని చెప్పారు. నిందితుడి కాల్ లిస్ట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మరో మూడు కుట్రలు జరుగుతాయని మంత్రి కేసీఆర్ కూడా చెప్పారన్నారు. వారికి అవి ఎలా తెలుసునన్నారు. ఫాక్స్‌కాన్‌ను బెంగళూరుకు తరలిస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరిట తప్పుడు లేఖతో ప్రచారం చేశారని మండిపడ్డారు. కర్ణాటక నుంచి కిరాయి మనుషులను తెప్పించి ఇక్కడ ప్రదర్శనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కుట్ర సాగుతోందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం మౌనంగా ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు.