Team India: కివీస్ తో సెమీస్ కోసం ముంబయి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు
- వరల్డ్ కప్ తొలి సెమీస్ లో టీమిండియా × న్యూజిలాండ్
- ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- ఈ నెల 15న సెమీస్ సమరం
వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా సెమీఫైనల్ చేరుకోవడం తెలిసిందే. ఈ నెల 15న జరిగే తొలి సెమీఫైనల్లో రోహిత్ సేన న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో, టీమిండియా నేడు ముంబయి చేరుకుంది. ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి నేరుగా ప్రత్యేక బస్సులో తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు.
ఈ మెగా టోర్నీ లీగ్ దశలో టీమిండియా రికార్డు స్థాయిలో మొత్తం 9 మ్యాచ్ ల్లో గెలిచింది. తద్వారా 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 9 మ్యాచ్ లలో 5 విజయాలు నమోదు చేసింది. తద్వారా నాలుగో స్థానంలో నిలిచి సెమీస్ బెర్తు దక్కించుకుంది.
వరల్డ్ కప్ టోర్నీ లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ లో ఆడతాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో... రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ మ్యాచ్ లు ఆడతాయి. ఈ నెల 16న జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా తలపడనున్నాయి.