RS Praveen Kumar: బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై హత్యాయత్నం కేసుల నమోదు

Telangana BSP President RS Praveen Kumar and his son booked for attempt to murder in Kagaznagar police station

  • రూ. 25 వేలు దొంగిలించారంటూ కూడా కేసు నమోదు 
  • ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రూ. 25 వేలు దొంగిలిస్తాడా? అన్న ప్రవీణ్ కుమార్ 
  • తనతోపాటు పీహెచ్‌డీ స్కాలర్ అయిన తన కుమారుడిపైనా కేసు నమోదైందన్న ప్రవీణ్ కుమార్
  • ‘బీఆర్ఎస్-బీజేపీ కూటమి’ కుట్రల నుంచి తెలంగాణను కాపాడతానని ప్రతిన 

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి బీఎస్పీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.


ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. కాగజ్‌నగర్ పోలీసులు తనపైనా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ స్కాలర్ అయిన తన కుమారుడితోపాటు పార్టీలోని మరో 11 మంది సీనియర్ సభ్యులపైనా హత్యాయత్నం (సెక్షన్ 307) కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప కనుసన్నల్లోనే ఈ కేసులు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు.


ఎమ్మెల్యే వాహనం నుంచి తాను రూ. 25 వేలు దొంగిలించానని, ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశాడన్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అందులోనూ 26 ఏళ్లు ఎటువంటి మచ్చలేకుండా సేవ చేసిన అధికారి రూ. 25 వేలు దొంగతనం చేస్తాడా? అని ప్రశ్నించారు. రెండు దశాబ్దాలుగా కోనేరు కోనప్ప వల్ల సిర్పూరు కాగజ్‌నగర్ ప్రాంత వాసులకు దక్కుతున్నదేమిటో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ దుష్పరిపాలనకు ఇదో మచ్చుతునక అని విమర్శించారు.


ఇలాంటి తప్పుడు కేసులు తనను భయపెట్టలేవని, నీతితప్పిన బీఆర్ఎస్ పాలన నుంచి సిర్పూరును విముక్తి చేసే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కూటమి’ కుట్రల నుంచి తెలంగాణను కాపాడతానని శపథం చేశారు.


ఆదివారం రాత్రి కాగజ్‌నగర్‌లో బీఎస్పీ-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. బీఎస్పీ బహిరంగ సభ ప్రదేశానికి బీఆర్ఎస్ ప్రచార వాహనాలు పెద్దసౌండ్‌తో పాటలు పెట్టుకుంటూ రావడం గొడవకు కారణమైంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రవీణ్ కుమార్ కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు.

  • Loading...

More Telugu News