Aishwarya Rai: పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఎంతగా దిగజారిపోయాడో.. నటి ఐశ్వర్యరాయ్‌పై దారుణ వ్యాఖ్యలు.. వీడియో ఇదిగో!

Pak Former Cricketer  Abdul Razzaq insults  Aishwarya Rai

  • పాక్ క్రికెట్ బోర్డును టార్గెట్ చేస్తూ రజాక్ వ్యాఖ్యలు
  • తమకు మంచి క్రికెటర్లను తయారు చేయాలని లేదంటూ విమర్శలు
  • ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మంచి, పవిత్రమైన పిల్లలు పుట్టరంటూ చవకబారు వ్యాఖ్యలు

ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. నేలకు దిగజారి చౌకబారు కామెంట్లు చేస్తూ తమనుతాము పతనం చేసుకుంటున్నారు. మాజీ క్రికెటర్లు షాహిది ఆఫ్రిది, ఉమర్‌గిల్‌ సమక్షంలో జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో అబ్దుల్ రజాక్ హద్దులు ఉల్లంఘించాడు. అతడు దిగజారిపోయాడు సరే.. ఆఫ్రిది అయినా వారించాలి కదా.. అలా చేయకపోగా పళ్లు ఇకిలించి, చప్పట్లు కొట్టి అభినందించి అభిమానుల్లో చులకనయ్యాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రపంచకప్‌లో పాక్ జట్టు తాజా ప్రదర్శనపై మీడియా అడిగిన ప్రశ్నకు.. పాక్ క్రికెట్ బోర్డును టార్గెట్ చేస్తూ రజాక్ ఓ ఉదాహరణ చెప్పాడు. అప్పట్లో కెప్టెన్‌గా యూనిస్‌ఖాన్ మెరుగైన ప్రదర్శన చేస్తాడని నాకు నమ్మకం ఉండేది. జట్టులో అందరం అదే అనుకున్నాం. కానీ, ఇప్పుడు వాస్తవానికీ ఏం జరుగుతోందంటే.. మంచి ఆటగాళ్లను తయారుచేయాలని కానీ, పాక్‌లో క్రికెట్‌ను మెరుగుపర్చాలని కానీ తమకు(బోర్డుకు) లేదని పాక్ బోర్డును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అక్కడితో ఆగకుండా.. ‘‘ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల మంచి, పవిత్రమైన పిల్లలు పుడతారని అనుకుంటే, అలా ఎప్పటికీ జరగదు’’ అని దారుణ వ్యాఖ్యలు చేశాడు.  

విమర్శల వెల్లువ
అబ్దుల్ రజాక్ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది. అతడి నుంచి అంతకుమించి ఆశించడం తప్పే అవుతుందని, రోజురోజుకు మరింతగా దిగజారిపోతున్నాడని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘అందుకే.. చదువు ముఖ్యమని చెప్పేది’ అని మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశాలు తిరిగినా చదువు లేకపోతే పతనం కొనసాగుతూనే ఉంటుందని మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News