Shoaib Akhtar: ఐశ్యర్యారాయ్ పై రజాక్ వ్యాఖ్యలను ఖండించిన షోయబ్ అక్తర్
- ఓ కార్యక్రమంలో దారుణ వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్
- ఐశ్వర్యా రాయ్ ను పెళ్లి చేసుకుంటే పవిత్రమైన పిల్లలు పుడతారా అంటూ వ్యాఖ్యలు
- అతడి పక్కన కూర్చుని ఉన్నవాళ్ల బుద్ధి ఏమైందన్న షోయబ్ అక్తర్
- ఏ మహిళను ఇలాంటి వ్యాఖ్యలతో అవమానించరాదని హితవు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యం, తమ దేశ క్రికెట్ బోర్డు తీరును విమర్శించే క్రమంలో, ఏ మాత్రం సంబంధంలేని ఐశ్వర్యా రాయ్ గురించి ప్రస్తావించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ... ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రజాక్ వ్యాఖ్యలను పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా తప్పుబట్టాడు. రజాక్ వేసిన ఈ కుళ్లు జోకును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు అక్తర్ తెలిపాడు. ఈ విధంగా పోల్చడం ద్వారా ఏ మహిళను అవమానించరాదని హితవు పలికాడు.
రజాక్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతడి పక్కన కూర్చుని ఉన్నవాళ్లు వెంటనే అభ్యంతరం చెప్పి ఉండాల్సిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కానీ వాళ్లు కూడా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ అతడి కామెంట్లను ఎంజాయ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రజాక్ ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయగా.... ఆ సమయంలో వేదికపై అతడి పక్కనే పాక్ మాజీలు షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, సయీద్ అజ్మల్, కమ్రాన్ అక్మల్ ఉన్నారు.