Krishna: సూపర్ స్టార్ కృష్ణకి షూటింగులో ఎదురైన ప్రమాదాలు ఇవే!
- కృష్ణ భోజన ప్రియుడన్న మాధవరావు
- ఆయనకి చికెన్ అంటే ఇష్టమని వెల్లడి
- రాత్రి 10 గంటల వరకూ వర్క్ చేసేవారని వివరణ
- చాల ప్రమాదాల నుంచి బయటపడ్డారని వ్యాఖ్య
తెలుగు సినిమా ప్రయాణంలో .. ఎదుగుదలలో కృష్ణ పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాలి. కథాకథనాల పరంగా .. సాంకేతిక పరంగా తెలుగు సినిమాను ఆయన పరుగులు తీయించారు. అలాంటి కృష్ణ వర్ధంతి నేడు. కృష్ణ పర్సనల్ మేకప్ మెన్ గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన మాధవరావు, ఆయన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.
"కృష్ణగారు మంచి భోజన ప్రియుడు. చికెన్ - ఫిష్ ఆయన చాలా ఇష్టంగా .. ఆస్వాదిస్తూ తినేవారు. విజయ నిర్మల గారు ఒక డైట్ ప్లాన్ సెట్ చేసి .. ఆ ప్రకారమే చేసి పెట్టేవారు. వరుస షూటింగులతో ఆయన రాత్రి 9 - 10 గంటల వరకూ కూడా పనిచేసేవారు. ఆ తరువాత మాత్రం సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే చేసేవారు" అని అన్నారు.
"కృష్ణ కెరియర్లో షూటింగు సమయంలో చాలా ప్రమాదాలు జరిగాయి. అదృష్టం కారణంగా ఆయన వాటి నుంచి బయటపడ్డారు. ఒక సినిమా షూటింగులో నిజమైన 'పులి'కి మత్తు ఇచ్చి బావిలో దానితో ఫైట్ సీన్ పెట్టారు. కృష్ణపై కొన్ని షాట్స్ తీసిన తరువాత ఆయన పైకి వచ్చారు .. డూప్ లోపలికి దిగాడు. పులికి మత్తు దిగిపోవడంతో ఒక్కసారిగా డూప్ పై అది దాడి చేసింది" అని చెప్పారు.
"ఇక 'మాయదారి మల్లిగాడు' సినిమా షూటింగులో కృష్ణకి ఉరిశిక్ష వేసే సీన్ కోసం సెట్ వేశారు. ఆదుర్తి సుబ్బారావుగారు దర్శకుడు. ఉరికంబం సీన్ అయిపోగానే కృష్ణ అక్కడి నుంచి బయటికి అడుగుపెట్టారు. అంతే అప్పటి వరకూ ఆయన కాళ్ల క్రింద వేసిన చెక్కలు ఒక్కసారిగా కూలిపోయాయి. కృష్ణ ఆ క్షణంలో అక్కడ ఉంటే నిజంగానే ఉరిపడిపోయేది. దాంతో ఆదుర్తిగారు కృష్ణను కౌగలించుకుని చాలాసేపు ఏద్చేశారు" అని చెప్పారు.