World cup: వాంఖడె మ్యాచ్ కు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం
- ఇండియా-న్యూజిలాండ్ మధ్య నేడు సెమీ ఫైనల్ మ్యాచ్
- మ్యాచ్ జరిగే సమయంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంటుందంటూ బెదిరింపులు
- ట్విట్టర్ లో ఆగంతుకుడి హెచ్చరిక.. అలర్టయిన ముంబై పోలీసులు
వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ జరిగే సమయంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంటుందంటూ ఓ ఆగంతుకుడు ట్విట్టర్ లో బెదిరింపులకు పాల్పడ్డాడు. తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ హెచ్చరించాడు. దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలు కానుండగా గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం కలకలం రేగింది. ఈ ట్వీట్ నేపథ్యంలో స్టేడియంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా, గతంలోనూ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఇదేవిధంగా బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లో జరిగిన భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా ఇలాగే బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. స్టేడియంపై దాడి చేస్తామంటూ ఈ-మెయిల్ రావడంతో అప్రమత్తమైన గుజరాత్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.