Israel Gaza war: గాజాలో పిల్లలను చంపడం ఆపాలన్న ట్రూడో.. నెతన్యాహు స్పందన ఏమిటంటే..!

Trudeau Says Killing Of Babies In Gaza Must Stop Netanyahu Responds
  • మహిళలు, చిన్నారులపై హత్యాకాండ ఆపేయాలన్న కెనడా ప్రధాని
  • పిల్లల మరణాలకు కారణం హమాస్ మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ ప్రధాని కౌంటర్
  • గాజా సరిహద్దుల్లో జరిగిన హమాస్ మారణకాండలో 1200 మంది చనిపోయారని వెల్లడి
గాజాలో చిన్న పిల్లలు, మహిళలపై జరుగుతున్న హత్యాకాండ వెంటనే ఆపేయాలంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చిన్నారుల మరణాలు, మహిళల కన్నీళ్లను ప్రపంచమంతా టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తోందని వ్యాఖ్యానించారు. వైద్యులు, బాధితులు మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయాన్ని ట్రూడో గుర్తుచేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, చావు సమీపంలోకి వెళ్లి బతికి బయటపడ్డ బాధితుల అనుభవాలు హృదయవిదారకంగా ఉన్నాయని చెప్పారు. గాజాలో పిల్లల మరణాలను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందంటూ ట్రూడో పరోక్షంగా ఇజ్రాయెల్ పై వ్యాఖ్యలు చేశారు.

కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ పీఎం బెంజమన్ నెతన్యాహు షార్ప్ గా రియాక్టయ్యారు. గాజాలో పిల్లలు, మహిళల మరణాలకు పూర్తి బాధ్యత హమాస్ మిలిటెంట్లదేనని స్పష్టం చేశారు. పౌరులపై దాడులు చేయడం, ప్రతి దాడులను తప్పించుకోవడానికి సామాన్యులను అడ్డుపెట్టుకోవడం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. గాజా సరిహద్దుల్లో గత నెల 7న హమాస్ మిలిటెంట్లు నిర్వహించిన మారణకాండను ప్రస్తావిస్తూ నెతన్యాహు ట్వీట్ చేశారు.

మిలిటెంట్లు జరిపిన ఊచకోతలో 1200 మంది చనిపోయారని, ఇందులో ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచ దేశాల పౌరులు ఉన్నారని పేర్కొన్నారు. దాదాపు 200కు పైగా పౌరులను మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారని చెప్పారు. తమ లక్ష్యం మిలిటెంట్లు మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. నార్త్ గాజాలోని పాలస్తీనియన్లు సౌత్ గాజా వెళ్లేందుకు సేఫ్ రూట్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని నెతన్యాహు గుర్తుచేశారు. మిలిటెంట్లు మాత్రం బందీలను, సామాన్య పౌరులను అడ్డుపెట్టుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారని నెతన్యాహు ఆరోపించారు.
Israel Gaza war
Canada pm
Justin Trudeau
Israel pm
netanyahu tweet
kids death
gaza hospital

More Telugu News