KTR: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ కానీ వ్యక్తుల మధ్య కాదు: సిరిసిల్లలో కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీ పెద్దలు కేసీఆర్ గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు
- అరవై ఏళ్లు కాంగ్రెస్కు అవకాశమిస్తే ఏం చేసిందని ప్రశ్న
- కులం, ప్రాంతం ఫీలింగ్ వద్దని.. కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేద్దామని పిలుపు
ఈ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ అని, వ్యక్తుల మధ్య పోటీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ పెద్దలు కేసీఆర్ గొంతు నొక్కడానికి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాకముందు దాదాపు అరవై ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏంచేశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్ కోసం పొలాల వద్ద జాగారం చేసేవారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ అలాంటి పాలన వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ వారికి అసలు వ్యవసాయం గురించే తెలియదని విమర్శించారు. అందుకే వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ అని రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. తెలంగాణ గొంతు కేసీఆర్ అన్నారు. కులం, ప్రాంతం ఫీలింగ్ చూపవద్దని, కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేసుకుందామన్నారు.