Balakrishna: పవన్ కల్యాణ్ గురించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
- జనసేనానితో తనకు భావసారూప్యత ఉందన్న ఎమ్మెల్యే
- ఇద్దరమూ ముక్కుసూటిగా మాట్లాడతామని వెల్లడి
- టీడీపీ-జనసేన కలయికతో రాష్ట్రంలో కొత్త శకానికి నాంది
- హిందూపురంలో జరిగిన సమావేశంలో బాలయ్య కామెంట్స్
జనసేనాని పవన్ కల్యాణ్ తో తనకు భావసారూప్యత ఉందంటూ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇద్దరమూ ముక్కుసూటిగా మాట్లాడే వాళ్లమేనని చెప్పుకొచ్చారు. గురువారం హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఇద్దరమూ రాజకీయాల్లోకి వచ్చామన్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా హిందూపురంలో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.
అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నీ అన్నీ అని కాకుండా మొత్తం అన్ని స్థానాలను గెలుచుకోవాలని కోరకుంటున్నట్లు తెలిపారు. నేరస్తులు, హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
ప్రతిపక్షంలో ఉన్నా కూడా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నామని బాలకృష్ణ చెప్పారు. పరిపాలన చేతకాక, మూడు రాజధానులంటూ జగన్ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. పారిశ్రామిక సదస్సులంటూ పెయిడ్ ఆర్టిస్టులతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారని, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ పదేళ్లు వెనకబడిపోయిందని విమర్శించారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రతీ ఒక్కరూ బయటకొచ్చి ఆందోళన చేయాలని బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.