Harish Rao: కర్ణాటకలో అమలు చేయని హామీలు తెలంగాణలో నెరవేరుస్తారా?: హరీశ్ రావు
- బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్న హరీశ్ రావు
- కాంగ్రెస్ పార్టీని జహీరాబాద్లో 12 సార్లు గెలిపించినా చేసిందేమీ లేదని విమర్శ
- స్విచ్ వేస్తే వచ్చే కరెంట్ కావాలా? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? నిర్ణయించుకోవాలన్న హరీశ్ రావు
బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. జహీరాబాద్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచి పన్నెండుసార్లు గెలిపించినా చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ వాటిని అమలు చేయడం లేదన్నారు. అక్కడ వారి ఐదు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కర్ణాటకలో అమలు చేయని హామీలు తెలంగాణలో నెరవేరుస్తారా? అని నిలదీశారు.
కర్ణాటకలో ఐదు గంటల ఉచిత విద్యుత్ హామీని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కనీసం రెండు గంటలు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు మొత్తాన్ని ఎకరాకు క్రమంగా రూ.16,000కు పెంచుతామన్నారు. జనవరి నుంచి అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో ఊరంతా ఆదర్శ రైతులే అన్నారు. కటక (స్విచ్) వేస్తే వచ్చే కరెంట్ కావాలా? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కర్ణాటకలో పెన్షన్ రూ.600 ఇస్తున్నారని, కల్యాణలక్ష్మి అక్కడ అమలులో లేదన్నారు. ఈసారి గెలవగానే జనవరి నుంచి సన్నబియ్యం ఇస్తామన్నారు.