K Kavitha: 'ఎలక్షన్ గాంధీ' రాహుల్ అలా చెబితే... రేవంత్ రెడ్డి దుకాణం తెరిచి సీట్లు అమ్మేశాడు: కవిత
- రైతులను అవమానించే రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏం ఆలోచిస్తారని ప్రశ్న
- తప్పుడు పార్టీకి ఓటేస్తే కరెంట్ రాదని, కర్ణాటకలో అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య
- తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగు బంధమన్న కవిత
రైతులను అవమానించే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏం ఆలోచిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్ల ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాము గెలిస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారని, అప్పుడు రైతుబంధు రాదని, ధాన్యం కొనుగోలు డబ్బులూ రావని కవిత అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, అలాంటి అపోహలను పటాపంచలు చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రగామిగా నిలిపారన్నారు. తప్పుడు పార్టీకి ఓటేస్తే కరెంటు రాదని, కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో అదే పరిస్థితి నెలకొందన్నారు.
పేద ప్రజల పట్ల ఆలోచన, రైతన్నల బాగుకోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాన్ని కేసీఆర్ పూర్తిగా సాకారం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 73 లక్షల ఎకరాలకు నేరుగా సాగునీరు అందిస్తున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ నాయకులు అన్ని రంగులూ మారుస్తారన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి... పోతుంటాయి. కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగు బంధమన్నారు.
తెలంగాణను పుట్టించింది, రైతుబంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మిని ప్రారంభించింది కేసీఆర్ అన్నారు. ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తారని, అందుకే ఆయనకు తాను ఎలక్షన్ గాంధీ అని పేరు పెట్టానన్నారు. ఆయన మొహబ్బత్ కా దుకాణ్ అంటూ ప్రేమను పంచుతామని హిందీలో చెబితే హిందీ రాని రేటెంత రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ దుకాణ్ అంటున్నారని, ఈ దుకాణం తెరిచి సీట్లన్ని అమ్ముకున్నారన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. కేంద్రంలోని బీజేపీతో పైసా లాభం లేదన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలిపిన పాపం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. 1969లో తెలంగాణ కావాలని అడిగితే 369 మందిని కాంగ్రెస్ కాల్చి చంపిందని, మనల్ని కష్టపెట్టిన వారికి ఓటేస్తే మోసపోతామన్నారు.