gone prakash rao: విదేశాల్లో బ్యాంకు ఖాతాలు... లక్షల సింగపూర్ డాలర్ల మార్పిడి: విజయరమణారావుపై గోనె ప్రకాశ్ రావు ఆరోపణలు
- పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విజయరమణారావు
- 2018, 2023లలో వేర్వేరు పాన్ కార్డు నెంబర్లు ఎందుకు ఇచ్చారో చెప్పాలని నిలదీత
- ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విదేశీ బ్యాంకుల్లో డబ్బులు కూడబెట్టి హవాలా ద్వారా తెప్పించుకున్నారని ఆరోపణ
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావుకు సింగపూర్, హాంకాంగ్, జర్మనీ దేశాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఆయన పలు కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విదేశాల్లో బ్యాంకు ఖాతా తీయాలంటే ఆ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆన్‌లైన్‌లో అకౌంట్ తెరుచుకోవచ్చన్నారు. 2018, 2023 సంవత్సరాల్లో వేర్వేరు పాన్ కార్డు నెంబర్లు ఎందుకు ఇచ్చారో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎన్నిసార్లయినా వివరాలు, అడ్రస్ మార్చుకోవచ్చునని, కానీ ఎట్టి పరిస్థితిలో నెంబర్లు మారకూడదన్నారు. కానీ విజయరమణారావు ఇందుకు భిన్నంగా వ్యవహరించారన్నారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విదేశీ బ్యాంకుల్లో డబ్బును కూడబెట్టి... వ్యాపారం చేసి వాటి మీద వచ్చిన డబ్బును హవాలా ద్వారా తెప్పించుకొని, పాన్ కార్డును బయటపడేశారన్నారు. మళ్లీ కొత్త పాన్ కార్డు తీసుకొని ఇన్‌కం ట్యాక్స్ అధికారులను తప్పుదోవపట్టించారన్నారు. ఎన్నికల ఆఫిడవిట్‌లో తన పేరు మీద, భార్య పేరున ఉన్న అన్ని ఆస్తులు చూపలేదని, తన భార్య పేరు మీద దుబ్బాపేటలో సుమారు 2 ఎకరాల భూమిని 2023 ఆఫిడవిట్‌లో చూపలేదన్నారు.
మూడేళ్ల క్రితం హాంకాంగ్ నుంచి వేణు అనే వ్యక్తి అకౌంట్ నుంచి విజయరమణారావు ఖాతాకు రూ.40 లక్షల 50 వేల సింగపూర్ డాలర్ల మార్పిడి జరిగిందన్నారు. ఆయనకు దమ్ముంటే విదేశాల్లో ఉన్న బ్యాంకు అకౌంట్లపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈడీ విచారణకు ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో ఢీల్లీకి వెళ్లి హోంశాఖ, ఈడీకి ఫిర్యాదు చేయడంతో పాటు పేరున్న ఆడిటర్‌తో విదేశీ అకౌంట్ల వివరాలు సేకరిస్తామన్నారు.