Puvvada Ajay Kumar: ఆయన వస్తే నా గెలుపు తథ్యం... ఇది నాకు సెంటిమెంట్: పువ్వాడ అజయ్
- హోంమంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తానన్న పువ్వాడ అజయ్
- 2018లో, కార్పోరేషన్ ఎన్నికల్లో మంచి విజయం సాధించామన్న మంత్రి
- కేసీఆర్ గుండెల్లో మహమూద్ అలీకి స్థానం ఉంటుందని వ్యాఖ్య
హోంమంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే తన గెలుపు తథ్యమని, ఇది తనకు సెంటిమెంట్ అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ముస్లిం, మైనార్టీ సభలో పువ్వాడ అజయ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ... 2018 నవంబర్‌లో ఖమ్మం ప్రాంతంలో మైనార్టీ సభ తనకు సెంటిమెంట్‌గా మారిందని తెలిపారు. ఆ తర్వాత కార్పోరేషన్ ఎన్నికల్లో మహమూద్ అలీ ప్రచారం చేస్తే 16కు 16 స్థానాలు వచ్చాయన్నారు. ఆయన వస్తే తన గెలుపు తథ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్... మొదటి డిప్యూటీ సీఎం పదవిని ముస్లింలకు కేటాయించారని, ఇది మైనార్టీల పట్ల కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ గుండెల్లో మహమూద్‌కు స్థానం ఉంటుందన్నారు.
అంతకుముందు మహమూద్ అలీ మాట్లాడుతూ... ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ మైనార్టీలకు ఏం చేయలేదని, బీఆర్ఎస్ వీరికి ఎన్నో పథకాలు తీసుకు వచ్చిందన్నారు. ముస్లింల కోసం కేసీఆర్ రూ.3200 కోట్లు ఖర్చు చేశారని, కానీ కాంగ్రెస్ కనీసం రూ.50 లక్షలు ఖర్చు చేయలేదన్నారు. షాదీ ముబారక్‌తో పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలిచారన్నారు.
నా తమ్ముడు అజయ్.. పదేళ్లుగా ప్రజల మధ్య ఉన్నాడని, నా తమ్ముడికి మీరంతా తోడుగా ఉండాలని కోరారు. తాను తెలంగాణ మొత్తం తిరుగుతున్నానని, అన్నింటి కంటే ఎక్కువగా ఖమ్మం అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ముసలి పార్టీ అని, పట్టించుకునే వారు లేరన్నారు. వీల్ చైర్‌లో తిరిగే ముసలివాడు కావాలా? యువకుడైన పువ్వాడ అజయ్ కావాలా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల కంటే అధిక మెజార్టీతో పువ్వాడను గెలిపించాలన్నారు.