lb nagar: ఎల్బీ నగర్లో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు... ఈవీఎంలలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు
- ఈవీఎంలలో వినియోగించే బ్యాలెట్ యూనిట్లో గరిష్ఠంగా 16 చొప్పున అభ్యర్థులకు అవకాశం
- ఎల్బీ నగర్లో 48 మంది అభ్యర్థులు, నోటా కలిపి 49కి చేరిన అభ్యర్థులు
- 54 నియోజకవర్గాల్లో ఒక బ్యాలెట్ యూనిట్ వినియోగం
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అత్యధికంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి 48 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నోటాతో కలుపుకుంటే 49కి చేరుకుంటుంది. దీంతో ఇక్కడ నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించాల్సి ఉంటుంది. ఈవీఎంలలో వినియోగించే బ్యాలెట్ యూనిట్లో గరిష్ఠంగా 16 చొప్పున అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి 48 మంది బరిలో ఉండటంతో వారికి మూడు, నోటా కూడా కలుపుకోవడంతో నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించవలసి వస్తోంది.
15 అంతకంటే తక్కువమంది అభ్యర్థులు 54 స్థానాల్లో పోటీలో ఉన్నారు. ఒకటి నోటా ఉంటుంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో వినియోగించే బ్యాలెట్ యూనిట్ ఒకటి సరిపోతుంది. 16 నుంచి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్న 55 నియోజకవర్గాల్లో 2 బ్యాలెట్ యూనిట్లు, 32 నుంచి 47 మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల సంఖ్య 9 ఉండటంతో ఇక్కడ మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయి.