India: ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో కువైట్ ను ఓడించిన భారత్
- 2026 ప్రపంచ కప్ కోసం వివిధ దేశాల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్ లు
- గత రాత్రి కువైట్ నగరంలో మ్యాచ్
- కువైట్ పై 1-0తో గెలిచిన భారత్
- భారత్ తరఫున ఏకైక గోల్ చేసిన మన్వీర్ సింగ్
ఫిఫా వరల్డ్ కప్-2026 కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఆసియా స్థాయిలో జరిగిన ఫిఫా క్వాలిఫయర్స్ లో భారత్ గెలుపు బోణీ కొట్టింది. గత రాత్రి కువైట్ తో జరిగిన రెండో రౌండ్ పోరులో భారత్ 1-0తో విజయం సాధించింది. భారత్ తరఫున ఏకైక గోల్ ను మన్వీర్ సింగ్ సాధించాడు.
కువైట్ నగరంలోని జబేర్ అల్ అహ్మద్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత్ జోరు ప్రదర్శించింది. క్రొయేషియా సాకర్ దిగ్గజం ఇగోర్ స్టిమాక్ కోచ్ గా వచ్చాక భారత్ ఆటతీరు యూరోపియన్ శైలిలోకి మారింది. వేగవంతమైన పాస్ లు, ప్రత్యర్థి డిఫెండర్లను, గోల్ కీపర్ ను ఏమార్చే ఎత్తుగడలను భారత ఆటగాళ్లు వంటబట్టించుకున్నారు.
ఈ విజయంతో భారత్ కు 3 పాయింట్లు లభించాయి. తొలి అర్ధభాగంలో భారత్, కువైట్ జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే రెండో అర్ధభాగంలో మన్వీర్ సింగ్ గోల్ చేసిన గోల్ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపింది. ఈ ఫిఫా క్వాలిఫయింగ్ రౌండ్లలో భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఖతార్ తో నవంబరు 21న భువనేశ్వర్ లో ఆడనుంది.
భారత్ ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్ లో 102వ స్థానంలో ఉంది. ఖతార్ 61వ ర్యాంకు జట్టు. ఖతార్ కు వరల్డ్ కప్ లలో ఆడిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో... భారత్ తనకంటే మెరుగైన ర్యాంకింగ్, అనుభవం ఉన్న ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరమైన అంశం. అయితే, ఈ మ్యాచ్ సొంతగడ్డపై ఆడనుండడం భారత్ కు కలిసొచ్చే అంశం.