Cyclone Mythili: ఏపీకి తుపాను ముప్పు లేనట్టే!
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను
- 'మిధిలీ'గా నామకరణం
- ఉత్తర వాయవ్య దిశగా పయనం
- రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి 'మిధిలీ' అని నామకరణం చేశారు. మాల్దీవులు సూచించిన మేరకు ఈ పేరు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుపాను ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
గంటకు 20 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుపాను రేపు (నవంబరు 18) తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ తుపాను ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం పేర్కొంది.