TDP: టీడీపీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై అఖిలపక్ష సమావేశం... నేతలు ఎవరేమన్నారంటే...!
- విజయవాడలో సమావేశం
- టీడీపీ తరఫున హాజరైన అచ్చెన్నాయుడు, బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర
- సీపీఐ రామకృష్ణ, జనసేన తరఫున పోతిన మహేశ్ హాజరు
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రౌండ్ టేబుల్ సమావేశం ఇన్చార్జి బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, సీపీఐ రామకృష్ణ, జనసేన నేత పోతిన మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బుద్ధా వెంకన్న: జగన్ ప్రభుత్వం బీసీలను చూసి ఓర్వలేకపోతోంది. ఇవాళ్టి కార్యక్రమంలో అచ్చెన్నాయుడికి గద బహూకరించాం. ఎందుకంటే... చంద్రబాబు చేస్తున్న పోరాటానికి హనుమంతుడిలా వెంట ఉండి సాయపడుతున్నాడు. ఉత్తరాంధ్ర నుంచి ఇటు చిత్తూరు వరకు వైసీపీ శ్రేణులను తరిమి తరిమి కొడతాడని ఆయనకు గద ఇచ్చాం.
కొల్లు రవీంద్ర: బీసీలను మోసగించేందుకే వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేపడుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బీసీలు బుద్ధి చెబుతారు.
సీపీఐ రామకృష్ణ: టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. అదే సమయంలో సీపీఐ-సీపీఎం కూడా అసెంబ్లీలో ఉండాలి. ప్రశ్నించే గొంతుకలు ఉన్నప్పుడే అధికార పక్షం సక్రమంగా నడుస్తుంది. వైసీపీని నడిపించే నలుగురు కీలక నేతలు జగన్ సామాజిక వర్గానికి చెందినవారే. రాష్ట్రంలో పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఉంది. రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టిన వీళ్లు ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర అంటున్నారు.
పోతిన మహేశ్: జగన్ ముమ్మాటికీ బీసీ ద్రోహి. బీసీలపై వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లను జగన్ తీసేశారు.