k laxman: నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచినా తెలంగాణకు బీజేపీ ఎంతో చేసింది!: డాక్టర్ కె.లక్ష్మణ్
- ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు వృద్దాప్య పించన్లు అంటున్నాడని విమర్శలు
- దళిత ముఖ్యమంత్రి నుంచి ఎన్నో హామీలను కేసీఆర్ విస్మరించారని మండిపాటు
- బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామన్న లక్ష్మణ్
తెలంగాణలో గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారని, అయినప్పటికీ కేంద్రం రూ.9 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని... ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. వివిధ శాఖల్లో ఉన్న 3 లక్షల ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయలేదని, దీంతో స్కూల్స్ మూతబడుతున్నాయన్నారు. గ్రామీణ యువత ఉద్యోగాల కోసం పట్నానికి వచ్చి ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకు భారంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ఇటీవల ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు బీజేపీ నిరసనలు తెలిపితే తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారన్నారు. కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా పెన్షన్లు అనడం విడ్డూరమన్నారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, గిరిజనులకు రిజర్వేషన్లు, బీసీ బంధు, కాంట్రాక్ట్ విధానం రద్దు... ఇలా అన్ని హామీలను విస్మరించారన్నారు. కానీ తెలంగాణకు బీజేపీ ఎన్నో ఇచ్చిందన్నారు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణ, సైన్స్ సిటీ ఏర్పాటు, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు, ఆర్ఆర్ఆర్‌కు ఆమోదం, అత్యధిక రైల్వే బడ్జెట్ నిధులు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, వందేభారత్ రైళ్లు, జాతీయ రహదారులు, ఎయిమ్స్ ఇలా ఎన్నో కేంద్రం ఇచ్చిందన్నారు. తాము బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామన్నారు.
కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కలిసి మరోసారి మోదీ ప్రధానమంత్రి కాకూడదని కుట్రలు చేస్తున్నాయన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేశాయని, కానీ ఇప్పుడు తమపై బురద జల్లుతున్నారన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ 59 స్థానాలు గెలిచినా ఒక్కడూ పార్టీలో మిగలరని, అందరూ బీఆర్ఎస్ వైపు పోతారని ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారన్నారు. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కూటమిలో చేర్చుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు.