KTR: ఫలితాల తర్వాత కోడళ్లకు కేసీఆర్ శుభవార్త చెబుతారు: మంత్రి కేటీఆర్
- బీఆర్ఎస్ అన్ని సమస్యలు పరిష్కరించింది.. మాకేమిటని కోడళ్లు అడుగుతున్నారన్న కేటీఆర్
- డిసెంబర్ 3వ తేదీ తర్వాత కేసీఆర్ వారికి గుడ్ న్యూస్ చెబుతారన్న మంత్రి
- ప్రగతి పథంలో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని ఇతరుల చేతుల్లో పెడితే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరిక
నీరు, కరెంట్‌తో పాటు అనేక సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని, మరి మాకేం చేస్తోందని ఆడబిడ్డలు అడుగుతున్నారని, అత్తలకు పెన్షన్ వస్తోంది.. మా సంగతేమిటని కోడళ్లు అడుగుతున్నారని, డిసెంబర్ 3వ తేదీ తర్వాత కోడళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ శుభవార్త చెబుతారని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన ఆడబిడ్డల కోసం సౌభాగ్యలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేస్తామన్నారు. నెలకు రూ.3వేలు మీ ఖాతాల్లో వేస్తామన్నారు. ఖానాపూర్‌లో పార్టీ అభ్యర్థి జాన్సన్‌తో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసే ప్రతి ఓటు కేసీఆర్‌కు వేసినట్లుగా భావించాలన్నారు.
తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని, ఇలాంటి రాష్ట్రాన్ని ఇతరుల చేతుల్లో పెడితే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి వస్తున్నారని, వారిద్దరి అజెండా... కేసీఆర్ గొంతు నొక్కడమే అన్నారు. ఎంతమంది వచ్చినా బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ప్రజల మీదే భారం వేసిందన్నారు. గతంలో కంటే ఎక్కువ మందికి పెన్షన్ ఇస్తున్నామని, అది కూడా గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా ఇస్తున్నామన్నారు. తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి మన డబ్బులు మనం తీసుకుంటున్నామన్నారు. ఇదివరకు సర్కార్ దవాఖానాకు వెళ్లను బాబోయే అనేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.