Mohammed Shami: బంతి స్వింగ్ కాకపోతే తాను ఏం చేస్తాడో చెప్పిన షమీ
- వరల్డ్ కప్ లో షమీ వికెట్ల వేట
- 6 మ్యాచ్ ల్లో 23 వికెట్లు
- సెమీస్ లో కివీస్ పై 7 వికెట్లు తీసిన షమీ
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో తొలి నాలుగు మ్యాచ్ లకు రిజర్వ్ బెంచ్ పై ఉన్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆ తర్వాత జట్టులోకి వచ్చి ఏ స్థాయిలో విజృంభిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 6 మ్యాచ్ ల్లో 23 వికెట్లు పడగొట్టి తనలోని కసిని క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. అందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. సెమీస్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్ల ప్రదర్శన షమీ కెరీర్ లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
ఈ వరల్డ్ కప్ లో తన బౌలింగ్ ప్రదర్శన అమోఘమైన రీతిలో సాగుతుండడం పట్ల షమీ స్పందించాడు. "మొదట మ్యాచ్ లో పరిస్థితి ఎలా ఉందో గమనిస్తాను. పిచ్ ఎలా స్పందిస్తోంది? బంతి స్వింగ్ అవుతోందా, లేదా? అని పరిశీలిస్తాను. ఒకవేళ బంతి స్వింగ్ కాకపోతే మాత్రం స్టంప్ లైన్ లో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాను. స్వింగ్ లేనప్పుడు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం వల్ల బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచే వీలుంటుంది. బ్యాటర్లను డ్రైవ్ చేసేలా పురిగొల్పేందుకు ఓ ప్రత్యేకమైన జోన్ లో బంతిని పిచ్ చేస్తాను. దాంతో వారు డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించి క్యాచ్ ఇస్తారు" అంటూ షమీ తన గేమ్ స్ట్రాటజీని వివరించాడు.