bsp: నేను హెలికాప్టర్లో రావడానికి కారణం వారే... రేపు వారే ఓనర్లు అవుతారు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ఉద్యోగులు, పోలీసులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్న బీఎస్పీ తెలంగాణ చీఫ్
- దొరల గడీలను కూలుస్తామన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- అన్ని కులాలకు సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీయే అన్న ఆర్ఎస్పీ
ఉద్యోగులు, పోలీసులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలులో బీఎస్పీ రాజ్యాధికార సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూలుస్తామన్నారు. ఓట్లు మావి, సీట్లు మీకా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,50,000 కోట్లు గోదావరి పాలయ్యాయన్నారు. కేసీఆర్ రాజ్యంలో జీతాలు రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నవంబరు 30న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు గూబ గుయ్మనేలా సమాధానమివ్వాలన్నారు.
బీర్లు క్వార్టర్లు మా పేదలకు పంచి... డబ్బులు, పదవులు మీకా? అని నిలదీశారు. కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రోడ్డెక్కితే ప్రజలు రాళ్లతో కొడతారన్నారు. కేసీఆర్ను ఈ ఎన్నికల్లో గద్దె దించాలన్నారు. కోయ, లంబాడి చిరు ఉద్యోగులు ఇచ్చిన విరాళాలతో హెలికాప్టర్లో తాను వస్తున్నానని, రేపటి రోజున బహుజనులే హెలికాప్టర్లకు ఓనర్లు అవుతారన్నారు.