Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం
- దక్షిణ ఫిలిప్పీన్స్ పై ప్రభావం
- ఒకరి మృతి... 18 మందికి గాయాలు
- సునామీ భయం లేదన్న పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం
పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉన్న ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. దక్షిణ ఫిలిప్పీన్స్ లో సంభవించిన ఈ భూకంపం తీవ్రతకు భవనాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 6.2 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. భూకంపం కారణంగా ఒకరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు.
మిండానావో దీవికి సమీపంలో 60 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ఫిలిప్పీన్స్ తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.