Viswa Samudra Engineering: శబరిమల ఆలయంలో 18 మెట్లు వర్షానికి తడవకుండా హైడ్రాలిక్ రూఫ్ ఏర్పాటు చేస్తున్న విశ్వ సముద్ర సంస్థ
- భక్తుల కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
- పదునెట్టాంబడి మెట్ల వద్ద కొత్త పిల్లర్లు చూసి ఆశ్చర్యపోయిన భక్తులు
- రూ.70 లక్షల ఖర్చుతో హైడ్రాలిక్ రూఫ్ నిర్మిస్తున్న విశ్వ సముద్ర సంస్థ
హైదరాబాద్ కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగమైంది. కేరళలోని శబరిమలలో సుప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయంలో విశ్వ సముద్ర సంస్థ ఓ కీలక నిర్మాణం జరుపుతోంది. స్వామివారి ఆలయంలోని 18 మెట్లను పదునెట్టాంబడి పేరిట పరమ పవిత్రంగా భావిస్తారు.
ఇన్నాళ్లు ఈ మెట్లు ఎలాంటి పైకప్పు లేకుండా ఉన్నాయి. అయితే విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ ఈ మెట్లకు వర్షం నుంచి రక్షణ కల్పించేలా హైడ్రాలిక్ రూఫ్ నిర్మిస్తోంది. ఈ యాంత్రిక రూఫ్ డిజైన్ ను చెన్నైకి చెందిన కాపిటల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ అనే సివిల్ ఇంజినీరింగ్ కంపెనీ రూపొందించింది.
గతేడాది మే 17న ఈ హైడ్రాలిక్ రూఫ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.70 లక్షలు. అయ్యప్ప స్వామికి తన వంతు కానుకగా ఈ ఖర్చంతా విశ్వ సముద్ర సంస్థ భరిస్తోంది. వర్షం లేనప్పుడు ఈ హైడ్రాలిక్ రూఫ్ రెండు వైపులా మూసేయవచ్చు. వర్షం వచ్చేటప్పుడు ఓపెన్ చేస్తే రూఫ్ లా మారిపోతుంది
కాగా, దేశంలో అయ్యప్ప దీక్షల సీజన్ ప్రారంభం కాగా, నిన్న శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని తెరిచారు. భక్తులకు హైడ్రాలిక్ రూఫ్ నిర్మాణంలోని భారీ పిల్లర్లు స్వాగతం పలికాయి. ఈ పిల్లర్లను, నిర్మాణంలో ఉన్న హైడ్రాలిక్ రూఫ్ ను భక్తులు ఆశ్చర్యంగా తిలకించారు.
విశ్వ సముద్ర సంస్థ వారణాసిలో రూ.815 కోట్లతో రోప్ వే పనులు కూడా చేపట్టింది. ఏపీలో భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు కూడా ఈ సంస్థకే దక్కాయి.