Sri Lanka: జై షాపై రణతుంగ వ్యాఖ్యలు... విచారం వ్యక్తం చేసిన శ్రీలంక ప్రభుత్వం
- వరల్డ్ కప్ లో శ్రీలంక ఘోర వైఫల్యం
- లంక క్రికెట్ బోర్డును రద్దు చేసిన క్రీడల మంత్రి
- జై షా వల్లే శ్రీలంక బోర్డు నాశనం అయిందన్న అర్జున రణతుంగ
- లంక క్రికెట్ వ్యవస్థలోని లోపాలను జై షాకు ఆపాదించడం సరికాదన్న శ్రీలంక మంత్రి
వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు ఘోరంగా విఫలం కావడం తెలిసిందే. 10 జట్లు పాల్గొన్న వరల్డ్ కప్ లో లంక జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 7 ఓటములు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును క్రీడల మంత్రి రద్దు చేశారు.
అయితే, తమ సభ్య దేశం క్రికెట్ బోర్డులో రాజకీయ, ప్రభుత్వ జోక్యం నిబంధలనకు విరుద్ధమంటూ ఐసీసీ... శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో, శ్రీలంక క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా శ్రీలంక క్రికెట్ ను నాశనం చేశాడని, అతడి వల్లే శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఈ దుస్థితి వచ్చిందని అన్నాడు. జై షా అదుపాజ్ఞల్లోనే శ్రీలంక క్రికెట్ బోర్డు నడుస్తోందని ఆరోపించాడు.
రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. లంక పార్లమెంటు సమావేశాల్లో మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేశేఖర ఓ ప్రకటన చేశారు. ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాపై కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను శ్రీలంక ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించబోదని తెలిపారు. శ్రీలంక క్రికెట్ వ్యవస్థలోని లోపాలను ఏసీసీ అధ్యక్షుడికి ఆపాదించలేమని స్పష్టం చేశారు. రణతుంగ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.
కాగా, శ్రీలంకపై ఐసీసీ విధించిన నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసేలా చూడాలని జై షాను శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కోరారని మంత్రి హరీన్ ఫెర్నాండో వెల్లడించారు. అటు, శ్రీలంక బోర్డును రద్దు చేస్తూ క్రీడల మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక కోర్టు కొట్టివేసింది.
శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ సస్పెన్షన్ నేపథ్యంలో, వచ్చే ఏడాది లంక గడ్డపై జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్ నిర్వహణ అనిశ్చితిలో పడింది.