World Cup: రేపే వరల్డ్ కప్ ఫైనల్స్... పిచ్ రిపోర్ట్ ఇదే!
- రేపు ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్
- పిచ్ ను పరిశీలించిన రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్
- ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్లకు పిచ్ సహకరిస్తుందని సమాచారం
వరల్డ్ కప్ 2023 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో ఇంత వరకు ఓటమిని ఎరుగని టీమిండియా ఫైనల్స్ లో సైతం సత్తా చాటి, ప్రపంచకప్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అహ్మదాబాద్ లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా మొదలు పెట్టింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ ను పరిశీలించాడు. బీసీసీఐ పిచ్ క్యూరేటర్లు ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్ జయేశ్ పటేల్ తో కాసేపు మాట్లాడారు.
మరోవైపు, ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో ఇదే స్టేడియంలో భారత్ - పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ కు నల్లమట్టితో కూడిన పిచ్ ను రూపొందించారు. ఇప్పుడు కూడా అదే రకమైన పిచ్ ను తయారు చేసినట్టు సమాచారం. ఆశిష్ భౌమిక్, తపోష్ ఛటర్జీలతో పాటు బీసీసీఐ జీఎం (డొమెస్టిక్ క్రికెట్) అభే కురువిల్లా పిచ్ ను క్లోజ్ గా మానిటర్ చేశారు. ఫైనల్స్ కోసం స్లో ట్రాక్ రెడీ చేసినట్టు సమాచారం. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉండొచ్చని స్టేట్ అసోసియేషన్ క్యూరేటర్ ఒకరు తెలిపారు. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉందని చెప్పారు. 315 పరుగులు చేస్తే... సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బంది తప్పదని అభిప్రాయపడ్డారు.