Ind Vs Aus: ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్స్.. ఇండియా బలాబలాలు, అవకాశాలు ఇవే!

As Team India eyes elusive glory heres a SWOT analysis of the team

  • రోహిత్ శర్మ కెప్టెన్సీ, కోహ్లీతో పాటూ ఇతర బ్యాట్స్‌మెన్ల దూకుడు
  • షమీ భీకర ఫాం టీంకు కలిసొచ్చే మరో అంశం
  • హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో సమస్యకు అవకాశం
  • నూతనోత్తేజంతో ఉరకలేస్తున్న ఆస్ట్రేలియాతో పొంచి ఉన్న ప్రమాదం
  • ఆస్ట్రేలియా బౌలర్లతో అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

వరల్డ్ కప్‌ సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత్ అడుగుదూరంలో నిలిచింది. అవతలివైపు ఉన్నది ఆస్ట్రేలియా! పక్కా ప్రొఫెషనల్ టీం! విజయం కోసం చివరికంటా పోరాడుతుంది. ఇప్పటికే ఐదు సార్లు జగజ్జేతగా నిలిచిన చరిత్ర ఆస్ట్రేలియా సొంతం. ఫైనల్‌లో ఇరు జట్ల మధ్య భీకర పోరు తప్పదు. చివరిసారిగా 2003లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడి ఓటమి చవి చూసింది. ఏకంగా 125 పరుగుల తేడాతో కప్పు చేజార్చుకుంది. కానీ, భారత్ ఈసారి అద్భుత ఫాంలో ఉంది. ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోంది. మరి భారత్‌కు ఉన్న బలాలు, బలహీనతలు, విజయావకాశాలు ఏంటో ఓసారి చూద్దాం.

బలాలు..
కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుతో ఆడుతూ భారత్‌కు శుభారంభాన్ని ఇస్తున్నాడు. ఇప్పటివరకూ ఏకంగా 550 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ భారత్‌కు మరో ప్రధాన బలం. మ్యాచుల్లో సందర్భానికి తగ్గట్టు బౌలర్లను రొటేట్ చేస్తూ విజయాలను అందిస్తున్నాడు. 

విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పలు సందర్భాల్లో తమ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ ఆధిపత్యాన్ని నిలబెట్టారు. వరల్డ్ కప్‌లో భారత బౌలింగ్ స్క్వాడ్‌కు షమీ పర్యాయపదంగా మారాడు. దీనికి తోడు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ముహ్మద్ సిరాజ్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశారు. 

బలహీనతలు..
భారత్ ఎంత శత్రు దుర్భేద్యంగా ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ప్రస్తుతం ఐదు ప్రధాన బౌలర్లే అందుబాటులో ఉన్నారు. రోహిత్, కోహ్లీ, గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి పార్ట్‌టైం బౌలర్లకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రమే బౌలింగ్ ప్రాక్టీస్‌కు అవకాశం లభించింది. దీంతో, ఏ బౌలర్ అయినా భారీ పరుగులు ఇచ్చుకుంటున్న పరిస్థితి వస్తే టీంను ఆదుకునేందుకు మరో ప్రధాన బౌలర్ లేరని చెప్పకతప్పదు. ఓవైపు ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్ మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్ మరింత అప్రమత్తంగా ఉండకతప్పదు. టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ ఒకానొక సందర్భంలో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఫైనల్స్‌లో ప్రమాదకరంగా మారొచ్చు. 

గత మూడు వన్డే టోర్నీల్లోనూ ఆతిథ్య జట్లే కప్ గెలుచుకున్నాయి కాబట్టి ఈసారి భారత్ జగజ్జేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత క్రీడాకారులకు బాగా పరిచయమైన పిచ్‌లు, వాతావరణం, ఫాంలో ఉన్న క్రీడాకారులు, అభిమానుల మద్దతు.. ఇవన్నీ కలిసొచ్చే అంశాలే. 2011లో వరల్డ్ కప్‌ చేజార్చుకున్న భారత్ తరపున ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌ శర్మకు మరో అవకాశం ముందుకొచ్చింది. 

రిస్క్ ఇదే..
చెన్నైలో మ్యాచ్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా ప్రస్తుతం మరింత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. కాబట్టి, కోహ్లీ, రాహుల్‌ను ఈసారి ప్రాంభంనుంచే సమర్థవంతంగా అడ్డుకోవచ్చనే భయాలు ఉన్నాయి. సెమీస్‌లో ఆస్ట్రేలియా ప్రతాపం అసాధారణ స్థాయిలో ఉంది. దీంతో, వరుసగా ఎనిమిది మ్యాచుల్లో గెలిచిన దూకుడుతో భారత్‌ను ఢీకొట్టబోతోంది. అందుకే, భారత్ అత్యంత జాగరూకతతో వ్యవహరించకతప్పదన్న కామెంట్ వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News