Vijayashanti: తెరపై విమర్శలు.. తెరవెనుక ఒప్పందాలు!: బీజేపీ, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన విజయశాంతి
- బండి సంజయ్‌ని తొలగించవద్దని కోరినా పట్టించుకోలేదన్న విజయశాంతి
- కేసీఆర్ నాటిన విత్తనం బండి సంజయ్‌ని మార్చేసిందని వ్యాఖ్య
- బండి సంజయ్‌ని మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న రాములమ్మ
- కేసీఆర్‌పై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన విజయశాంతి
- అద్వానీ శిష్యురాలిని... ఆయన మాకు సంస్కారం నేర్పారని వ్యాఖ్య
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని తొలగించవద్దని అధిష్ఠానాన్ని కోరామని, కానీ ఆయనను తొలగించడంతో తెలంగాణలో బీజేపీ పరువు పోయిందని తాజాగా కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి అన్నారు. పార్టీలో చేరిన తర్వాత ఆమె తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం, పాతమిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితేనే ఆ పార్టీలోకి వెళ్లానని, కానీ ఏళ్లు గడచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆధారాలు ఉండి కూడా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. తెరపై విమర్శలు చేసుకుంటూ... తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శించారు.
కేసీఆర్ అవినీతిని బయటకు లాగి ఆయనను లోపలేస్తామని చెప్పారని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అందరూ... కేసీఆర్ అవినీతిపరుడని చెప్పారని, అలాగే మోదీ వద్ద కేసీఆర్ అవినీతికి సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయని, అయినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ... పార్టీ కార్యకర్తలను, నాయకులను మోసం చేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్‌ని మార్చవద్దని నాలుగు నెలల ముందు చెప్పానని, కానీ పట్టించుకోలేదన్నారు. బండి సంజయ్‌ని మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాటిన ఓ విత్తనం... బీజేపీలో బండి సంజయ్‌ని మార్చేసిందన్నారు.
బీజేపీలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి? ఇందుకు సంబంధించిన కేసు ఏమయింది? ఆలోచించాలన్నారు. బీజేపీని వాళ్లకు వాళ్లే నాశనం చేసుకున్నారన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కూలిపోతుంటే బీజేపీ ఏం చేస్తోంది? అని నిలదీశారు. తనను విమర్శించే హక్కు బీజేపీకి లేదని, తానేమీ కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పని చేసే వ్యక్తిని కాదన్నారు. మీలాగా నేను ఎవరికీ లొంగిపోయేది లేదన్నారు. తాను అద్వానీ శిష్యురాలినని, మాకు ఆయన సంస్కారం నేర్పారన్నారు. మీలా అసభ్యంగా మాట్లాడలేనన్నారు. తనపై ఇష్టారీతిన మాట్లాడేవారు నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.