Mamata Banerjee: టీమిండియా ఆటగాళ్లకు ప్రాక్టీసులో ఆ రంగు జెర్సీనే ఎందుకు ఇస్తున్నారు?: మమతా బెనర్జీ
- వరల్డ్ కప్ లో రెండు రకాల జెర్సీలు ధరిస్తున్న టీమిండియా ఆటగాళ్లు
- ప్రాక్టీసులో ఆరెంజ్ కలర్ జెర్సీల వినియోగం
- ఈ ఘనత మోదీ సర్కారుదే అంటూ మమతా బెనర్జీ విమర్శలు
వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు రెండు రకాల జెర్సీలు ధరిస్తున్నారు. మ్యాచ్ లలో యథావిధిగా బ్లూ జెర్సీలు ధరిస్తుండగా, ప్రాక్టీసులో మాత్రం కొత్తగా ఆరెంజ్ కలర్ జెర్సీల్లో దర్శనమిస్తున్నారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు.
క్రికెట్ లోనూ కాషాయ రంగును తీసుకురావడం నరేంద్ర మోదీ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా విశేషంగా రాణిస్తోందని, మనవాళ్లు కప్ గెలవడం ఖాయమని అందరూ నమ్ముతున్నారని, కానీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం టీమిండియా సహా దేశంలోని వివిధ సంస్థలను కూడా కాషాయ రంగులోకి మార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మెట్రో స్టేషన్లకు సైతం కాషాయ రంగు వేస్తున్నారని మమత మండిపడ్డారు.
కోల్ కతాలో జగద్ధాత్రి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మమత ఈ వ్యాఖ్యలు చేశారు.