Ind Vs Aus: ఫైనల్స్‌పై టాస్ ప్రభావం ఎంత? రోహిత్ శర్మ అభిప్రాయం ఇదే!
- వరల్డ్ కప్ ఫైనల్స్ టాస్‌పై సర్వత్రా ఉత్కంఠ
- టాస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్న కెప్టెన్ రోహిత్ శర్మ
- మ్యాచ్ రోజున పిచ్ పరిశీలించాక టాస్‌పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్స్‌కు కొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో టాస్ ఎవరు గెలుస్తారన్న చర్చ పతాకస్థాయికి చేరుకుంది. గెలుపు అవకాశాలపై టాస్ ప్రభావం ఎంత ఉండబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. దీనిపై రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి మ్యాచ్‌లో టాస్ ప్రభావం అధికంగా ఉంటుందని తాను అనుకోవట్లేదని అన్నాడు.
‘‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పిచ్‌పై గడ్డి ఉండేది. ఈ వికెట్‌పై అంతగా లేదు. అప్పట్లో పిచ్ ఇప్పటితో పోలిస్తే కాస్త డ్రైగా ఉంది. అయితే, మ్యాచ్ జరిగే రోజును ఓసారి పిచ్‌ను పరశీలించి నిర్ణయం తీసుకోవాలి. వాతావరణం కూడా కాస్త చల్లబడింది. అయితే తేమ ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. పాకిస్థా్న్తో మ్యాచ్ సందర్భంగా ట్రెయినింగ్ రోజున తేమ ఎక్కువగా ఉంది. కానీ, మ్యాచ్ రోజున మాత్రం లేదు. వాంఖడే స్టేడియంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది. ట్రెయింగ్ తీసుకుంటుండగా బోలెడంత తేమ కనిపించగా మ్యాచ్ రోజున మాత్రం తేమ లేదు. కాబట్టి టాస్ ప్రభావం తక్కువని అనుకుంటున్నాను’’ అని రోహిత్ చెప్పాడు.