Yuvraj Singh: కోహ్లీ, రోహిత్, బుమ్రా కాదు.. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ గెలుచుకునే ఆటగాడెవరో చెప్పిన యువరాజ్ సింగ్

Mohammed Shami Deserves Player Of The Tourney Award Says Yuvraj Singh
  • ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డుకు షమీనే అర్హుడన్న మాజీ ఆల్‌రౌండర్
  • కోహ్లీ, రోహిత్, బుమ్రా కంటే అతడికే అవకాశాలు ఎక్కవని యువరాజ్
  • ఆరు మ్యాచుల్లో ఏకంగా 23 వికెట్లు పడగొట్టిన షమీ
  • న్యూజిలాండ్‌పై సెమీస్‌లో ఏడు వికెట్లు తీసిన పేసర్
ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో టాస్ పడనుంది. ఈ టోర్నీలో కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్నారు. రోహిత్ పరుగుల వరద పారిస్తుండగా, కోహ్లీ సెంచరీలతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇక, బుమ్రా, షమీ బంతితో మ్యాజిక్ చేస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దక్కించుకునేదెవరో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంచనా వేశాడు. రోహిత్, కోహ్లీ, బుమ్రాతో పోలిస్తే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు అందుకునే అవకాశాలు మహ్మద్ షమీకే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అతడే అందుకు అర్హుడని పేర్కొన్నాడు.

ఈ టోర్నీలో షమీ నిప్పులు చెరుగుతున్నాడు. ఆరు మ్యాచుల్లోనే ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. తొలుత నాలుగు మ్యాచుల్లో అతడిని పక్కన పెట్టిన జట్టు.. హార్దిక్ పాండ్యా గాయంతో దూరం కావడంతో షమీకి స్థానం కల్పించింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి తానేంటో నిరూపించిన షమీ.. సెమీస్‌లో అదే జట్టుపై ఏడు వికెట్లు తీసి ప్రపంచకప్ సెమీస్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు.
Yuvraj Singh
Mohammed Shami
Virat Kohli
Jasprit Bumrah
Rohit Sharma
World Cup 2023 Final
Player of the Tourney

More Telugu News