Revanth Reddy: 2012 నుంచి 2014 వరకు సీమాంధ్ర నేతలు మాట్లాడినట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు: రేవంత్ రెడ్డి
- ఈ పదేళ్లు రూ.5వేల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? టీపీసీసీ చీఫ్ ప్రశ్న
- తెలంగాణ ప్రజలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్న రేవంత్ రెడ్డి
- ధరణి రద్దయితే రైతుబంధు రాదని కేసీఆర్ మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని ఆగ్రహం
- హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి
2012 నుంచి 2014 వరకు సీమాంధ్ర నేతలు మాట్లాడినట్లుగా... ఇప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబం మాట్లాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఐదు వేల పెన్షన్ ఇస్తానని కేసీఆర్ ఇప్పుడు చెబుతున్నారని, మరి ఈ పదేళ్లు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. నిజాం రాజులాగా కేసీఆర్ మనపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తోందని, కానీ నిజాం రాజునే తిరస్కరించిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. ఈ ప్రాంతవాసులు ఆకలిబాధను తట్టుకుంటారు కానీ... ఆత్మగౌరవానికి దెబ్బతగిలితే ఊరుకోరన్నారు. ఇప్పుడు మరో ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలకు అనుగుణంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. ఈ ఎన్నికలను ఎన్నికలలా కాకుండా ఉద్యమంలా చూడాలని కోరారు. పెన్షన్ రూ.5వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ఆదాయం ఉన్నప్పుడు ఇన్నేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కానీ కేసీఆర్ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారని... ఏ సబ్ స్టేషన్‌కైనా వెళ్లి లాగ్ బుక్ చూద్దామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి నియోజకవర్గానికైనా వెళదామని అన్నారు.
ధరణి పేరుతో దళితులకు చెందిన 25 లక్షల ఎకరాల భూములను కేసీఆర్ వెనక్కి తీసుకున్నారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు భూములను తన సన్నిహితులు, ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. ధరణిని రద్దు చేసి, అంతకుమించిన వ్యవస్థను తీసుకువస్తామంటే ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. ధరణి రాకముందు రైతుబంధు లేదా? అని నిలదీశారు. ధరణి రద్దయితే రైతుబంధు రాదని కేసీఆర్ మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి మనవడికి పదవి ఇవ్వాలనుకున్న కేసీఆర్‌కు తమ మేనిఫెస్టో చూసి భయం పట్టుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తామన్నారు.