World Cup: 13 ఓవర్లుగా టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా ఇవ్వని ఆస్ట్రేలియా
- అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
- 81 పరుగులకే 3 వికెట్లు డౌన్
- ఫైనల్లో తడబాటుకు గురైన టీమిండియా టాపార్డర్
ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ తడబాటుకు గురైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఓ పేలవ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్క్ విసిరిన లెంగ్త్ బాల్ ను గ్యాప్ లో కొట్టబోయి జంపాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గిల్ చేసింది 4 పరుగులే.
అయితే రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పార్ట్ టైమ్ బౌలర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించగా, ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరకతప్పలేదు. అప్పటికి జట్టు స్కోరు 9.4 ఓవర్లలో 2 వికెట్లకు 76 పరుగులు. కాసేపటికే టీమిండియాకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఓ ఇన్ కట్టర్ తో అవుట్ చేశాడు. దాంతో మైదానంలో నిశ్శబ్దం అలముకుంది.
టీమిండియా తొలి 15 ఓవర్లలో వీరవిహారం చేస్తుందనుకుంటే, వరుసగా వికెట్లు కోల్పోవడంతో అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. రిస్క్ తీసుకోకుండా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
ఆసీస్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసరడంతో టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే పరిస్థితులు కనిపించడంలేదు. వరుసగా 13 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లు టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదంటూ ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం టీమిండియా 24 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కోహ్లీ 47, కేఎల్ రాహుల్ 24 పరుగులతో ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 1, కమిన్స్ 1, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తీశారు.