Ch Malla Reddy: రేవంత్ రెడ్డిని గెలిపిస్తే చేసిందేమీ లేదు: మంత్రి మల్లారెడ్డి
- బీఆర్ఎస్‌పై ప్రజాదరణ చూస్తుంటే విజయం ఖాయమని అర్థమవుతోందన్న మల్లారెడ్డి
- కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన
- కేసీఆర్ సీఎం అయ్యాక ఇంటింటికీ మంచి నీరు అందించామన్న మల్లారెడ్డి
2019 లోక్ సభ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపిస్తే, ఆయన చేసిందేమీ లేదని మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై ఉన్న ఆదరణ చూస్తుంటే ఎన్నికల్లో తన విజయం ఖాయమని అర్థమవుతోందన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించండని అభ్యర్థించారు. గత ప్రభుత్వాలు తాగు, సాగునీరు ఇవ్వలేకపోయాయని, కానీ బీఆర్ఎస్ వచ్చాక ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటింటికి నీరు అందించామన్నారు.