Vijayashanti: పార్టీ మారారని విమర్శిస్తున్నవారికి కౌంటర్ ఇచ్చిన విజయశాంతి
- బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని మాటిచ్చి బీజేపీ నాయకులు పట్టించుకోలేదని వ్యాఖ్య
- చర్యలు ఉంటాయని బండి సంజయ్, కిషన్‌రెడ్డితోపాటు పలువురు చెప్పారని పేర్కొన్న రాములమ్మ
- ట్విటర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ నేత
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ మారారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాములమ్మ స్పందించారు. పార్టీ మారారని విమర్శించే వాళ్లు ఒకటి తెలుసుకోవాలని, బీఆర్ఎస్ అవినీతిపై తప్పక చర్యలుంటాయని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పి, ఆ తర్వాత పట్టించుకోలేదని అన్నారు. మీరందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎందాకైనా పోరాడుతుందని తనతోపాటు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఒప్పించారని ఆమె అన్నారు. ఈ మేరకు నాడు బండి సంజయ్, కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నాయకులు అనేకసార్లు తన వద్దకు వచ్చి చెప్పారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని తెలిసే కదా ఇంతమంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెళ్లారని ఆమె విమర్శించారు. బీజేపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై చర్యలు తీసుకుంటామని కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి చేర్చుకున్నది నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణలో దుర్మార్గ పాలన పోవాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో ఏళ్లుగా పనిచేసిన కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లామని ఆమె పేర్కొన్నారు. కానీ, బీజేపీ నేతలు మాట నిలబెట్టుకోక పోగా తమను మోసగించారని విజయశాంతి అభివర్ణించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు జెండా మోసి తాను కొట్లాడానని ఆమె అన్నారు.