Revanth Reddy: 1994 నుంచి ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదు: రేవంత్‌రెడ్డి

Will come into power with 85 seats says Ravanth Reddy

  • తెలుగు ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్న పీసీసీ చీఫ్
  • ఈ ఎన్నికల్లో 80-85 సీట్లలో గెలవబోతున్నాం
  • ప్రగతి భవన్ పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్‌గా పేరు మార్చుతామన్న రేవంత్
  • కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు ఉండబోవని స్పష్టీకరణ

డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ రోజు నుంచి ప్రగతి భవన్ పేరును బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజాపాలన భవన్‌గా మార్చుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరికీ అందులోకి తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిన్న ఏర్పాటు చేసిన ‘మీట్ ద ప్రెస్’లో రేవంత్ పలు విషయాలపై సూటిగా స్పందించారు.

రాజకీయ పార్టీలకు ప్రజలు ఇచ్చే అధికారం కక్షలు తీర్చుకోవడానికి కాదని, ప్రజా సమస్యల కోసమని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ఉన్నట్టు కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు ఉండబోమని తేల్చి చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ తాను కక్షపూరితంగా వ్యవహరించలేదని రేవంత్ పేర్కొన్నారు. కొడంగల్‌లో గతంలో తనపై దాడి జరిగినా వ్యక్తిగత కక్షలు పెట్టుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలే కరెంటు ఇస్తామని, రైతులు 10 హెచ్‌పీ మోటార్లు కొనుక్కోవాలని తాను చెప్పలేదని, కానీ కేసీఆర్ మాత్రం తాను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు, బోరు నీటిని పారించే దూరాన్ని బట్టి అవసరమైతే రైతులే వాటిని కొనుక్కుంటారని మాత్రమే చెప్పినట్టు వివరించారు. 

ఉచిత కరెంటుపై పేటెంట్ కాంగ్రెస్‌దేనని పునరుద్ఘాటించారు. తమ ఆరు గ్యారెంటీలు సాధ్యం కాదని చెబుతున్న కేసీఆర్ అంతకుమించి ఇస్తామని చెప్పడం ద్వారా వాటి అమలు సాధ్యమేనని అంగీకరించారని అన్నారు. రాష్ట్రంలో హంగ్ వచ్చే అవకాశమే లేదని, 1994 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ తెలుగు ప్రజలు స్పష్టంగా ఏదో ఒక పార్టీకే పూర్తి మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తాము 80 నుంచి 85 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News