Pat Cummins: అప్పుడు నా గుండె దడ పెరిగింది.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్
- భారత్‌పై ప్రపంచకప్ గెలవడం తనకు ఓ మంచి అనుభూతన్న కమిన్స్
- ట్రావిస్ హెడ్, లబుషేన్ సరైన సమయంలో చెలరేగిపోయారని ప్రశంస
- భారత్‌ను 300 పరుగుల లోపు కట్టడి చేయాలని ప్లాన్ చేశామన్న కంగారూ కెప్టెన్
లక్ష్య ఛేదనలో అందరిలానే తన గుండె దడ కూడా పెరిగిందని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ వెల్లడించాడు. ఇండియాతో నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కంగారూ జట్టు విజయం సాధించి ప్రపంచ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం సారథి పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. క్రికెట్‌పై విపరీత ప్రేమాభిమానాలు చూపించే భారత గడ్డపై ఆడడం ఓ మంచి జ్ఞాపకమని, ప్రపంచకప్ గెలుచుకోవడం ఓ మంచి అనుభూతిని మిగిల్చిందని ఆనందం వ్యక్తం చేశాడు.
జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, లబుషేన్ సరైన సమయంలో రాణించారని ప్రశంసించాడు. తమ అత్యుత్తమ ప్రదర్శననను ఫైనల్ కోసం దాచి ఉంచినట్టు అయిందన్నాడు. టోర్నీ మొత్తం తాము తొలుత బ్యాటింగ్ చేశామని, ఫైనల్లో మాత్రం చేజింగ్‌కే మొగ్గుచూపినట్టు పేర్కొన్నాడు.
అహ్మదాబాద్ వికెట్‌పై 300 స్కోరు కష్టమని, అందుకనే భారత్‌ను ఆలోపు కట్టడి చేయాలని భావించామని చెప్పాడు. 240 పరుగులకే ప్రత్యర్థిని ఆపగలిగినా లక్ష్య ఛేదనలో అందరిలానే తన గుండెదడ కూడా విపరీతంగా పెరిగిందని గుర్తు చేసుకున్నాడు. బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడంలో హెడ్, లబుషేన్ విజయం సాధించారన్నాడు. హెడ్ ఒక లెజెండ్ అని కమిన్స్ కొనియాడాడు.