Team Of The World Cup: టీమ్ ఆఫ్ ద వరల్డ్ కప్ ను ఎంపిక చేసిన ఐసీసీ... కెప్టెన్ గా మనోడే!
- ముగిసిన వరల్డ్ కప్ టోర్నీ
- 11 మందితో జట్టును ప్రకటించిన ఐసీసీ
- రోహిత్ శర్మకు కెప్టెన్సీ
- కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, జడేజా, షమీలకు స్థానం
భారత్ లో 45 రోజుల పాటు సాగిన వరల్డ్ కప్ సంరంభం నిన్నటితో ముగిసింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ మెగా టోర్నీ అనేక రికార్డులకు వేదికగా నిలిచింది.
రచిన్ రవీంద్ర వంటి పలువురు కొత్త బ్యాటర్లు, గెరాల్డ్ కోట్జీ, దిల్షాన్ మధుశంక వంటి కొత్త బౌలర్లు ఈ టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ట్రావిస్ హెడ్, లబుషేన్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ వంటి టాప్ బ్యాట్స్ మెన్... షమీ, బుమ్రా, సిరాజ్, స్టార్క్, హేజెల్ వుడ్, ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్, జడేజా వంటి బౌలర్లు టోర్నీలో తమదైన ముద్ర వేశారు.
ఆఫ్ఘనిస్థాన్ పై గ్లెన్ మ్యాక్స్ వెల్ విధ్వంసక సెంచరీ, కివీస్ పై సెమీస్ లో 7 వికెట్ల ప్రదర్శన సహా షమీ వికెట్ల వేట ఈ టోర్నీలో హైలైట్ గా నిలుస్తాయి.
ఇక అసలు విషయానికొస్తే... ఐసీసీ టీమ్ ఆఫ్ ద వరల్డ్ కప్ ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్ గా పేర్కొన్నారు. ఐసీసీ జట్టులో కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ, జడేజా కూడా ఉన్నారు.
అయితే ఈ టోర్నీలో సెంచరీల మోత మోగించిన కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు ఈ జట్టులో చోటు లభించలేదు. అంతెందుకు, ఫైనల్లో సెంచరీతో టీమిండియాకు విజయాన్ని దూరం చేసిన ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను కూడా ఐసీసీ పట్టించుకోలేదు.
రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, కేఎల్ రాహుల్, గ్లెన్ మ్యాక్స్ వెల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మధుశంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ, గెరాల్డ్ కోట్జీ (12వ ఆటగాడు).