Chandrababu: చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్.. సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ సీఐడీ
- స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- చంద్రబాబుపై ఆరోపణలకు ఆధారాలు లేవన్న హైకోర్టు
- ఈరోజు సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ వేసే అవకాశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మరోవైపు, ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ఉన్న నేపథ్యంలో... ఆ రోజు వరకు తాము విధించిన షరతులు వర్తిస్తాయని హైకోర్టు తెలిపింది. 29వ తేదీ నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలను కోర్టుకు ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని చెప్పింది.
స్కిల్ ప్రాజెక్టులో దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయని చెప్పడానికి ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు ఆధారాలను చంద్రబాబుకు రిమాండ్ విధించడానికి ముందే చూపించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. దీన్ని దర్యాప్తులో లోపంగా భావిస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తున్నామని వెల్లడించింది.