KCR: మల్లు భట్టి విక్రమార్కకు ఒక్క ఓటు కూడా పడకూడదు: మధిరలో కేసీఆర్
- కాంగ్రెస్ గెలిస్తే డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా
- కాంగ్రెస్ పార్టీకి ఇరవై సీట్లకు మించి రావని జోస్యం
- మధిరను భట్టి పట్టించుకోలేదన్న ముఖ్యమంత్రి
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయినా ఆ పార్టీకి ఇరవై సీట్లకు మించి రావని వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క మధిరను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
మరోసారి ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే ఆయన ఏమీ చేయరన్నారు. నియోజకవర్గానికి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆయన చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుందని, వారిని పట్టించుకున్నది లేదన్నారు. దళిత సామాజిక వర్గం నుంచి మల్లు భట్టికి ఒక్క ఓటు కూడా పడకూడదని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజును గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. ప్రతి ఇంటికి మంచి నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్ అన్నారు. చిత్తశుద్ధితో పనులు చేస్తే విజయవంతమవుతాయని, బీఆర్ఎస్కు ప్రజల పట్ల నిబద్ధత ఉందన్నారు.